కుళలుఱవుత్యాగి 
                 
 
 
పిలవగానే వచ్చేవాడు దేవుడు ! తలచగానే వచ్చేది సద్గురువు !!

ఓం శ్రీ వల్లభ గణపతి కృప
ఓం శ్రీ అంగాళ పరమేస్వరి కృప
ఓం శ్రీ సద్గురువు కృప

మైసూరు బజ్జీ 

ఆ రోజు ఆదివారం. 
ఆదివారం వచ్చిందంటే చాలు ఆ సిన్నోడికి ఆనందం. ఎందుకంటే ఆ రోజే అతను పెద్దాయన వద్ద రోజంతా అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను అడిగి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు పలు తీర్థయాత్రలకే అతడిని తీసుకెళతారు. ఆ తీర్థయాత్రలన్నీ ఎక్కువగా పాదయాత్రతోనే చేస్తుంటారు. కనుకనే మన సిన్నోడికి ఖుషీగా ఉంటుంది. 
దారి పొడవునా పలు సిద్ధపురుషులు, మహాపురుషులు చేసిన అద్భుతాలు, వారి త్యాగాలు గురించి ఆ పెద్దాయన చాలా ఉత్సాహంగా పూసగుచ్చినట్లు చెబుతూ ఉంటారు. దారిపొడవునా అక్కడక్కడా పెద్దాయన కొబ్బరినీళ్లు, తాటిముంజెలు, వేరుశెనగలు, పరోటా, మిఠాయిలు కొనిచ్చి సిన్నోడి కడుపు నింపుతుంటారు. అందుకే ఆదివారం ఎప్పుడొస్తుందా అని సిన్నోడు ఎదురుచూస్తూ ఉంటాడు. 

పక్షులకు ఆహారం వేస్తే దేవుడు నీ కళ్లకు కనిపిస్తాడు 

ఆ చిన్న వయస్సులో మన సిన్నోడికి నడచివెళ్ళటమంటే తెలీదు. ఎప్పుడూ ఉరకలాంటి పరుగులు తీస్తుంటాడు. అదీ ఆ పెద్దాయన్ని చూస్తేచాలు ఉత్సాహం ఎక్కువై పరుగువేగం పెంచేస్తాడు. పొద్దున అమ్మ ఇచ్చిన చద్దిఅన్నంలో కొన్ని ముద్దల్ని గబగబా నోట్లో వేసుకుని, ఆ ముద్దలు కడుపు లోపలికి వెళ్లకముందే, ఎప్పటిలాగే తండ్రి ఇంట్లోలేని సమయం చూసి, అమ్మకు ఏదో కుంటిసాకు చెప్పి గరుడపక్షిలా వేగంగా పరుగెత్తుకెళ్లి అంకాళమ్మ ఆలయం వద్ద వాలుతాడు. 
ఆ రోజుల్లో అంకాళమ్మ ఆలయానికి ప్రధాన ద్వారపు తలుపులు ఉండేవి కావు. అందువల్లే ఎప్పుడంటే అప్పుడు సిన్నోడు గుడిలోపలికి వెళ్లి అంకాళమ్మను ప్రదక్షిణం చేస్తుంటాడు. ఆ రోజు కూడా సిన్నోడు వెయ్యిన్ని ఎనిమిది సార్లు అంకాళమ్మను ప్రదక్షిణం చేశాడు. అయినా ఆ పెద్దాయన జాడ తెలియలేదు. ఓ వైపు పెద్దాయన నేర్పిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ తిరుగుతూ, మరోవైపు ఇంకా పెద్దాయన రాలేదేమిటా అని ఆరాటపడుతున్నాడు. గంటలు గడిచేకొద్దీ విసుగు కాస్త కోపంగా విశ్వరూపం దాల్చి అతడిని వేధించింది. పొద్దున అమ్మ పెట్టిన చద్ది అన్నం కడుపార తినకపోవడంతో కడుపులో ఆకలి దహించి వేస్తోంది. 
మిట్టమధ్యాహ్నం అక్కడికి పెద్దాయన వచ్చాడు.


సప్తసముద్రాలను ఓ నీటి చుక్కగా మార్చి తన అరచేతిలో అగస్త్యముని తాగటం వల్ల సముద్రాలన్నీ పవిత్రమయ్యాయి. కనుక సముద్రస్నానమాచరించేవారు తీరంలో 'శ్రీఅగస్తేశ్వరాయనమః' అని ఇసుకపై రాయాలి. ఆ అక్షరాలను అలలు తుడిచిన తర్వాత స్నానమాచరిస్తే ఆరోగ్యంగా ఉంటారు. 

పెద్దాయనకు ఓంకార మంత్రం పఠించి నమస్కరించిన సిన్నోడు తన కోపాన్ని వెళ్లగక్కక ముందే పెద్దాయన ''ఏమిటో తెలియలేదురా. పొద్దున్నుంచీ ఆకలి దంచేస్తోంది. బజ్జీలు తింటే ఆకలి తీరుతుందేమోరా! త్వరగా వెళ్లి మైసూరు బజ్జీలు తీసుకురా'' అని చెబుతూ తన కౌపీనంనుండి ఓ కొత్త పది రూపాయల నోటును ఇచ్చాడు. 
సిన్నోడికి సంతోషం! 'ఆహా మన ఆకలిని గుర్తించి పెద్దాయన బజ్జీలు తెప్పిస్తున్నారు' అని అనుకొని సంతోషపడ్డాడు. అదే సమయంలో ''ఈ పెద్దాయన బజ్జీలు తెమ్మని చెప్పి ఉంటే ఉరకులాంటి పరుగుతో వెళ్లి అరగంటలో బజ్జీలు కొని తేవచ్చు. అయితే ఈయన బజ్జీ అని చెప్పకుండా మైసూరు బజ్జీలు తీసుకురా అని చెప్పారే అవి ఎలా వుంటాయో, ఎక్కడ దొరుకుతాయో? ఎక్కడెక్కడ వెదకాలో?' అని అనుకుంటూ అయోమయంలో కొట్టుమిట్టాడాడు. 
ఆ సమయంలోనే అక్కడికి ఓ నడివయస్కుడు వచ్చాడు. వంటి నిండా విభూతి రేఖలు, పట్టుఅంగవస్త్రం ధరించి, బంగారు తాపడం కలిగిన రుద్రాక్ష మాల, చెవుల్లో పోగులు, పంచకచ్చం, నుదుటిపై చందనం, కుంకుమ తిలకం ధరించి చూసినవాళ్ళంతా చేతులెత్తి నమస్కరించేలా గంభీర స్వరూపం. పెద్దాయనను చూడగానే ఆయన నమస్కరించి వినయంగా నిలిచాడు. 
మన పెద్దాయన ఏమిటీ విషయం అన్నట్టుగా ఆయనకేసి చూశారు. ''స్వామీ నేను మైసూరు మహారాజుకు ప్రధాన వంటవాడిగా పనిచేస్తున్నాను. రాజుగారు ఏ కొరతలు రాకుండా చూసుకునేవారు. ఈమధ్య మనస్పర్థల కారణంగా అక్కడ పనికి వెళ్లాలని అనిపించడం లేదు. పెళ్లి కూడా జరుగలేదు. పనిమానుకుని ఇక్కడే ఓ హోటల్‌ నడుపుదామని అనుకుంటున్నాను. మైసూరు మహారాజు వద్దే మంచి వంటవాడిగా పేరుతెచ్చుకున్న నేను హోటల్‌ బాగా నడుపగలననే అనుకుంటున్నాను. ఈ విషయంలో మీరిచ్చే సలహాలు ఏవైనా పాటించేందుకు సిద్ధంగా ఉన్నాను స్వామీ'' అన్నాడు. ఆ వ్యక్తి మాటల్లో మహారాజు మెప్పు పొందినవాడిననే అహంకారం, గర్వం బయటపడం చూసి సిన్నోడు లోలోపల నవ్వుకున్నాడు. పెద్దాయన ప్రశాంతంగా ఆ వంటవాడు చెప్పినదంతా విన్నారు. కాసేపయ్యాక ''ఏమయ్యా! మైసూరు మహారాజుకు వంట చేసి పెట్టడాన్ని ఏదో వశిష్ట మహర్షికే సేవ చేసినంత గొప్పగా చెబుతున్నావే'' అంటూ నవ్వారు. 
ఆ వంటాయన దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ''స్వామీ!'' అంటూ పెద్దాయన కాళ్ళపై పడ్డాడు. పెద్దాయన ''అరే! ఈ ముసలోడి కాలిపై పడకూడదు. అంకాళమ్మ పాదాలకే మొక్కాలి'' అంటూ ఆయనను ఓదార్చాడు. 
ఆ వంటాయన కన్నీటి పర్యంతమై ''స్వామి నాది వశిష్ట గోత్రమని మీకెలా తెలిసింది?'' అని అడిగాడు. 
పెద్దాయన ముఖంలో మళ్లీ చిరునవ్వు. బదులు పలుకలేదు. 
కొద్దిసేపయ్యాక పెద్దాయన అతడితో ''నువ్వు ఉన్నత కులంలో జన్మించావు. వేదాలను అభ్యసించి, వాటిని కాపాడే కులంలో పుట్టిన నువ్వు వంటచేసి బతకొచ్చా? హోటల్‌ రంగంపై ఆశపడటం భావ్యమేనా? పెద్దదీ చిన్నదంటూ ఏ వృత్తీ లేదు. అయితే కులవృత్తిని విడిచిపెట్టకూడదు కదా. కనుక నువ్వు మహారాజు అనుమతిని తీసుకుని నీకు నచ్చిన చోట వేదపాఠశాలను నడుపు. జాతి, మత, కులాలకు అతీతంగా నిరుపేద విద్యార్థులందరికీ వేదాలను చక్కగా నేర్పించు!. ఇదే నా ఆదేశం. పైలోకంలో ఉన్న మీ పితృదేవతల ఆశయం కూడా ఇదే. వారంతా రాత్రనకా పగలనకా ఆ విషయం కోసమే దేవుళ్లను వేడుకుంటున్నారు. ఇదే నీ కులగురువైన వశిష్ట మహర్షికి చేసే సేవగా పరిగణించబడుతుంది'' అన్నారు. 
ఆ వంటమనిషి ముఖంలో ఉన్నట్టుండి ప్రశాంతత కనిపించింది. ''స్వామీ నా కళ్ళు తెరిపించారు. దారి తప్పబోతున్న నాకు చక్కటి మార్గం చూపారు. మీ మేలును ప్రాణమున్నంత వరకూ మరచిపోను స్వామీ'' అంటూ సెలవు తీసుకున్నాడు. 
సిన్నోడు ఆ మనిషి వెళుతుండటాన్నే చూశాడు. ఏదో అడగాలనుకున్నంతలోనే ఆ పెద్దాయన అడ్డుపడి ''ఎక్కడరా మైసూరు బజ్జీలు'' అని అడిగాడు. 
సిన్నోడికి అప్పుడే పెద్దాయన అడిగింది గుర్తుకొచ్చింది. 'ఆహా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామే! ఆ వంటవాడిని అడిగి వుంటే మైసూరు బజ్జీ ఎలా వుంటుందో చెప్పేవాడు కదా! మైసూరు బజ్జీని ఇప్పుడెక్కడ వెదికేది' అంటూ సణుగుకొన్నాడు. ఆ సిన్నోడి భావాలను పసిగట్టిన ఆ పెద్దాయన ''సిన్నోడా! నువ్వు ఎక్కడా వెతకాల్సిన పనిలేదురా! ఎదురుగుండా ఉన్న ఆ ముసలావిడ దుకాణం వద్దకెళ్ళి అడుగు. ఆవిడ కాల్చి ఇస్తుంది మైసూరు బజ్జీలు'' అన్నారు. 
సిన్నోడు ఖుషీ అయిపోయాడు. 'అబ్బా! ఓ గండం గడిచింది! ఈ మండుటెండలో కాలికి చెప్పులు కూడా లేకుండా ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుందోని అనుకున్నాను. పెద్దాయనది నిజంగానే పెద్ద మనసు! మనకు ఎలాంటి శ్రమలేకుండా చేశారు' అని కుదుటపడ్డాడు. 
అయితే విధి విలాసం మరో విధంగా ఉంటుందని ఆ సిన్నోడు తెలుసుకోలేకపోయాడు. 
పది రూపాయల నోటును చేత పెట్టుకుని ఆ గుడి బయటికి వేగంగా పరుగెత్తాడు. గుడి ఎదురుగానే ఓ బామ్మ బజ్జీల దుకాణం పెట్టుకుని ఉండటాన్ని చూశాడు. గుడికి భక్తులు ఎక్కువగా రాని సమయం అది. ఏవో కొన్ని ఫలహారాలు కాల్చి ఆ అవ్వ బతుకుబండి లాగిస్తోంది. 
సిన్నోడిని చూడగానే ఆ బామ్మ అడిగింది. ''ఏరా! మనవడా! ముసలాయన మైసూరు బజ్జీలు అడిగాడా?'' అని. 
సిన్నోడి ఆశ్చర్యమేసింది. వింతగాను అనిపించింది. 
'పెద్దాయన తనను బజ్జీలు కొనుక్కురమ్మన్న విషయం ఈవిడకెలా తెలిసింది?' అని అనుకునేంతలో ముసలావిడే ''ఒరే! నీ పరుగు వేగాన్ని చూసినప్పుడే అనుకున్నా! పెద్దాయన కోసం ఏదో కొనేందుకు వస్తున్నావని'' అంది. 

కడలి తరంగాలు చెబుతున్న రహస్యమేమిటి? ఏయే మహాపురుషులు, ఋషులు ఏయే దినాలలో ఏ కారణంగా అక్కడ స్నానమాచరించారనే రహస్యాలనే సముద్రతీరం వద్దకు వచ్చేవారికి చెబుతుంటాయి. మీరు సముద్రపు అలలను మొక్కి అవి చెబుతున్న సంగతులను వింటే మీ సమస్యలకు నివారణోపాయాన్ని చెప్పడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. 

పెద్దాయన తరచూ చెబుతుండేవారు, గురువాజ్ఞను తుపాకీ నుండి దూసుకువచ్చే తూటా లాంటి వేగంతో నెరవేర్చేవాడే నిజమైన శిష్యుడని. సిన్నోడు కూడా అంతే వేగంతో గురువాజ్ఞను నెరవేర్చేందుకు పరుగెత్తుకొచ్చి బామ్మ ఎదుట నిలబడటంతోనే గురువుపై ఆ బాలుడికున్న అపారభక్తిని ఆ బామ్మ తెలుసుకుంది. 
సిన్నోడు అతి కష్టం మీద తన నవ్వును ఆపుకుని అడిగాడు. 
''అది సరే బామ్మా! పెద్దాయన బజ్జీలే అడుగుతాడని నీకెలా తెలుసు? అదీ మైసూరు బజ్జీలే అడుగుతాడని నీకెలా తెలుసు?'' 
'ఇందులో ఆశ్చర్యమేముంది నాయనా' అనే విధంగా బామ్మ చూస్తూ ''బాబూ! తంజావూరు పెద్ద గుడిలో ఓ లింగం ఉంది చూశావూ! ఆ లింగమూర్తిని అడిగితే రోజూ బ్రహదీశుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలో అది చెబుతుండేది కదా. ఇప్పుడంతా దాన్ని అడిగి నైవేద్యం పెడుతున్నారో లేదో తెలియదు'' .
సిన్నోడు అవునంటూ ఆమోదించాడు. 
కొన్నేళ్లకు ముందు జరిగిన సంఘటనలు అతడికి గుర్తుకు వచ్చాయి. 
పెద్దాయనతో కలిసి ఓసారి తంజావూరు శ్రీ బ్రహదీశ్వరాలయానికి వెళ్ళినప్పుడు ''ఒరేయ్‌ సిన్నోడా! ఈ గుడిని శుభ్రం చేస్తే ఎంత బాగుంటుందో కదా!'' అన్నారు. 
''అవును వాద్యారా! చాలా బాగుంటుంది''. సిన్నోడు తన సద్గురువును వాద్యార్ అని పిలవడం రివాజు. వాద్యార్ అంటే ఒకరి కర్మ ఫలితాలను తన తపోబలంతో జ్ఞాన శక్తితో తీర్చగలవారని అర్థం.
''అలాగా! సరే నువ్వెళ్లి 300 మంది దైవ సేవకులకును ఇక్కడికి పిలుచుకొస్తావా?'' 
''మూడువందల మందా?'' సిన్నోడు ఆశ్చర్యపోయాడు. చెన్నైలో నివసించిన సిన్నోడికి తంజావూరులో అంతమంది తెలిసినవాళ్ళుంటారా? కాళ్ళావేళ్ళా పడితే ఒకరిద్దరు భక్తుల్ని పిలుచుకుని రావచ్చు. ఒకేసారి 300 మందిని, అదీ అరగంటలోపు తీసుకురావడమంటే మాటలా? ఏం చేయాలో తెలియక సిన్నోడు ఊరకున్నాడు. 
సిన్నోడు కళ్ళు తేలవేయటాన్ని గమనించిన పెద్దాయన ''ఒరేయ్‌! పెద్దగా సీను పెట్టొద్దు (పెద్దాయన అప్పుడప్పుడు ఇలాంటి చెణుకులు విసురుతుంటారు) నే చూసుకుంటాలే'' అంటూ వేగంగా గుడికి బయటికి వెళ్ళారు. వెళ్లిన కొద్ది నిమిషాలకే వేగంగా తిరిగొచ్చారు. సుమారు 300 మంది దైవ సేవకులు చీపుర్లు, బిందెలు, బకెట్లు, తపేలాలు, సీకాయిపొట్లాలు, నీటిని చిమ్మే పరికరాలు, ఇనుప బ్రష్‌లు అంటూ పరికరాలతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. 
సిన్నోడికి ఆశ్చర్యం! ఏమీ బోధపడలేదు. 
'వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు. ఒక వేళ పెద్దాయన దేవలోకం నుండి వీళ్ళని పిలుచుకొచ్చాడేమోననే సందేహమూ కలిగింది. అయితే వీళ్ళని చూస్తే మామూలు మనుషుల్లాగే కనిపిస్తున్నారు. ఇన్ని రోజులూ ఇక్కడకు వస్తున్నా ఏనాడూ వీళ్ళని చూడలేదే' అంటూ అయోమయంలో పడిపోయాడు. ఎవరో భుజాన్ని తడుతున్నట్లనిపించి సిన్నోడు ఆ ఆలోచనల నుండి బయటపడ్డాడు. పెద్దాయనే అతడి భుజాన్ని తట్టి స్పృహలోకి వచ్చేలా చేశాడని తెలిసింది. 
పెద్దాయన చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ''ఒరేయ్‌ ఈ చిన్న పని చేస్తామంటే మనుషుల్ని పిలుచుకురాలేనంటావు. ఈ ముసలోడు రోడ్లవెంబడి తిరిగి నలుగుర్ని తీసుకువస్తే, వారితో కలిసి పనిచేయనంటావా'' అన్నారు. 
సిన్నోడు వెంటనే తేరుకున్నాడు. చురుకుదనం తెచ్చుకుని ఆ కొత్త మనుషులతో కలిసి గుడిని శుభ్రపరిచే పనుల్లో పాల్గొన్నాడు. పెద్దాయన అప్పుడప్పుడూ బ్రహదీశ్వరుడిని చూపిస్తూ నిందాస్తుతిగా మాట్లాడుతుండేవారు. ''వాణ్ణి చూడరా! పెద్దింటోడు.'' (మెట్ల పైకెక్కి లింగమూర్తికి పూజలు పునస్కారాలు చేస్తుండటం వల్ల పెద్దాయన ఇలా వ్యంగ్యంగా అంటారు) ఆ పెద్దింటోడు కాపురం చేస్తున్న గర్భగుడిలో పేరుకుపోయిన చమురు తెట్టు, మురికిని తొలగించి, ఇటుకరాళ్ళతో నేలను బాగా రుద్ది, సోపు నీళ్ళతో శుభ్రంగా కడిగారు. ఇలా ఒక్కో సన్నిధిని నూనెమరకలంతా పోయేలా కడిగితోసారు. 
పెద్దాయన తీసుకొచ్చిన దైవసేవకులందరూ ఆయనతో ఇదివరకే బాగా పరిచయం ఉన్నవాళ్లేనని, ఎన్నో గుళ్ళలో పారిశుద్ధ్య పనులు చేసినవాళ్లని సిన్నోడికి అనిపించిది. సిన్నోడికి విసుగనిపించినా లోలోపల ఈ మనుషులే రాకుంటే నేనూ పెద్దాయన కలిసి ఈ బ్రహ్మాండమైన గుడిని ముక్కి మూలుగుతూ తుడిచి ఉండేవాళ్ళం కదా అని అనుకుంటూ కాస్త సంతోషపడ్డాడు. ఏమైనా పెద్దాయన ముందుచూపుతో నన్ను ఇబ్బంది పెట్టలేదు అది చాలు! ననుకుంటూ సంబరపడిపోయాడు. 
ఆలయాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత పెద్దాయన సువాసనలు వెదజల్లే సాంబ్రాణిని మండించి ఆలయమంతటా ధూపారాధన చేశారు. పెద్దాయన ఆలయంలో సాంబ్రాణి పొగలు వేసే దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. మేలైన సాంబ్రాణిని మెత్తగా పొడిచేసి, దానిని శుభ్రమైన తెల్లటి ధోవతి గుడ్డలో జల్లించి, ఆ పొడితో వాసనద్రవ్యాలను కలిపి ధూపకలశంపై పోసి వెలిగిస్తే తెల్లటి మేగల్లా ఆలయమంతటా ఆ పొగలు అలముకుంటాయి. ఆ సువాసనలు వెదజల్లుతూ వ్యాపించిన పొగలనడుమ మహేశుడిని చూసే ఎవరికైనా కైలాసంలోనూ, వైకుంఠంలోనో ఉన్నామనే భ్రాంతి అందరికీ కలుగుతుంది. పెద్దాయన ఏ గుడిలో ధూపం వేసినా, ఆ ఆలయ చరిత్రను, అక్కడ కొలువైన సిద్ధపురుషులు, వారి త్యాగాలు గురించి చెవులకింపుగా చెబుతూ సువాసనతో కూడిన సాంబ్రాణి పొగలు అంతటా వ్యాపించేలా చేస్తుంటారు. ఆలయంలోని ప్రతిస్తంభం వెనుక దాగి ఉన్న దైవీక విశేషాలన్నింటినీ చెబుతూ ధూపారాధన చేయడం అరుదైన అద్భుతమైన దృశ్యమే! 
ఆ రీతిలోనే ఈ తంజావూరు పెద్దగుడి ప్రాకారంలోని శతాధిక శివలింగాలకు సంబంధించిన ఆధ్యాత్మిక విశేషాలు చెబుతూ పెద్దాయన ధూపారాధన పూర్తి చేశారు. ఇలా శతాధిక శివలింగమూర్తులు గురించి ఆ పెద్దాయన వేల సంఖ్యలో చెప్పిన సంగతులన్నీ సిన్నోడు తన చిన్ని మెదడులో గుర్తుపెట్టుకునేందుకు చాలా కష్టపడేవాడు. ఈ విషయాన్నే పెద్దాయనతో చెప్పాడు. ''వాద్యారా! మీరేమో అలవోకగా అన్ని సంగతులూ చెబుతూ వెళతారు. ఆ సంగతుల్ని నేనెలా గుర్తుపెట్టుకునేది?'' అని అడిగాడు. 
ఎప్పటిలాగే పెద్దాయన దైవీకమైన చిరునవ్వు నవ్వారు. ''ఒరేయ్‌ ఈ విశేషాలన్నీ నీకోసం చెబుతున్నాననుకున్నావా? కాదురా! నువ్వూ నా అంతటి వయస్సులో నాలాగే ఇంతమంది దైవ సేవకులతో ఈ పెద్దింటోడి కాపురాన్ని (తంజావూరు పెద్దగుడిని) చక్కబరుస్తావు. ఆ సమయంలో ఈ శివలింగ మూర్తుల పేర్లు, వాళ్లెందుకు ఇక్కడ వచ్చిందీ, మానవాళికి వారి వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా అన్ని విషయాలు అందరికీ చెప్పటానికి అప్పుడు నీకు గుర్తుకు వస్తాయిరా'' అన్నారు. 
'చినిగిన నిక్కరు, చేత చిల్లిగవ్వ లేకుండా తిరిగే తను పెరిగి పెద్దయి వందల సంఖ్యలో దైవసేవకులతో కలిసి ఈ పెద్దగుడిని శుభ్రం చేస్తానా? అది సాధ్యమేనా?' అని అనుకుంటూ పెద్దాయన ఆ తర్వాత చెప్పిన అన్ని విషయాలను వినసాగాడు. 
అయితే పెద్దల మాటలు ఫలించకమానవు కదా! అలాగే మన సిన్నోడి విషయంలోనూ ఆ పెద్దాయన చేసిన దీవెనలు, ఆశీస్సులు అక్షరసత్యాలయ్యాయి! కొన్నేళ్ల తర్వాత పెద్దాయన చెప్పినట్లుగానే తిరుచ్చి, చెన్నై, పుదుచ్చేరి, తంజావూరు తదితర నగరాలకు చెందిన వందలాది మంది దైవసేవకులు శ్రీవెంకటరామస్వాముల ఆధ్వర్యంలో తంజావూరు బ్రహదీశ్వరాలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టే అరుదైన భాగ్యం ప్రాప్తించింది. ఆ సమయంలోనే పెద్దాయన సిన్నోడిగా ఉండిన వెంకటరామస్వాములకు తెలిపిన ఆధ్యాత్మిక సంగతులన్నీ స్పష్టంగా జ్ఞప్తికి రావటంతో వాటిని దైవసేవకులకు పూసగుచ్చినట్లు వివరించారు. తంజావూరు పెద్ద గుడి నందిమంటపంలోని స్తంభాల వెనుక దాగిన రహస్యాలు ప్రాకారంలో శివలింగమూర్తుల మహిమలు చెబుతూంటే అదొక పెద్దపురాణంగా మారింది. 
ఆ విధంగా అక్కడ ఆలయ సంప్రోక్షణ పనులు చేస్తుండగానే పెద్దాయన ఆలయ ప్రాకారంలో ఉన్న ఓ శివలింగమూర్తి వద్ద అడిగితే శ్రీబ్రహదీశ్వరుడికి సమర్పించాల్సిన నైవేద్యం ఏమిటో చెబుతాడని సిన్నోడికి తెలిపారు. శ్రీరాజరాజచోళుడు తంజావూరు ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆ విధంగానే ఈ శివలింగమూర్తి చెప్పిన రీతిలోనే ఆలయంలో ఉన్న తక్కిన మూర్తులకు నైవేద్యం సమర్పించేవారు. కాలగమనంలో ఆ భక్తి విశ్వాసాలు తగ్గడంతో శివలింగమూర్తి కూడా తన సంభాషణ శక్తిని ప్రదర్శించటం మానుకున్నారు. 
ఆ శివలింగమూర్తి గురించీ ఈ బామ్మ చెప్పటం సిన్నోడికి ఆశ్చర్యమేసింది. 'కొన్నేళ్లకు ముందు జరిగిన ఆ సంఘటన ఈ ముసలావిడకు ఎలా తెలిసింది? ఒక వేళ మనకు తెలియకుండా ఆలయ శుద్ధి పనులకు పెద్దాయన తీసుకొచ్చిన మనుషుల్లో ఈ ముసాలవిడ కూడా ఉందేమో? ఏమైనా సరే! ఆ పెద్దాయనకు బజ్జీలు కాల్చి ఇవ్వడం కూడా పూర్వజన్మ సుకృతమే కదా' అనుకుంటూ సిన్నోడు ఆ బామ్మ కాల్చి ఇవ్వనున్న బజ్జీలను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. 

కేరెట్‌, పచ్చ బఠానీలు వంటి కాయగూరలను గాడిదలకు తినిపిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి 

కేరట్‌, చిలగడదుంపలు, బంగాళా దుంపలు వంటి దినుసులను వండి పందులకు తినిపిస్తే కలరా, పచ్చకామెర్లు, ప్రాణాంతకపు వ్యాధులు మీ దరి చేరవు. 

అప్పుడే ఆ అవ్వ సిన్నోడిపై పిడుగులాంటి సంగతి చెప్పింది. ''నాయనా! పొద్దున కాల్చిన బజ్జీలన్నీ అయిపోయాయి. ఆ పెద్దాయనకు తాజాగా బజ్జీలు వేసిస్తా! నువ్వెళ్లి శెనగపప్పు కొనుక్కొస్తావా?'' అంది. సిన్నోడు గతుక్కుమన్నాడు. ఇక మీదట శెనగప్పు తీసుకొచ్చి, తడిపి ఆరబెట్టి, పిండిచేసి, బజ్జీలు కాల్చి, వాటిని పెద్దాయనకు ఇచ్చి, ఆపైన ఆయన తినగా పోను మిగిలే బజ్జీని తినటానికి ఎంత సమయం పడుతుందో ఊహించుకున్న సిన్నోడిలో అప్పటిదాకా ఉన్న ఉత్సాహం నీరుగారింది. 
పొద్దున్నుంచీ ఏమి తినకపోవడంతో ఆకలితో అలసటతో బాగా క్రుంగిపోయాడు సిన్నోడు. అంతలోనే ఆహా! ఆ పెద్దాయన బజ్జీలు తినటమే చాలా అరుదైన విషయం. అలాంటిది ఆయనే ''ఈ రోజు బజ్జీలు తినాలని ఉందిరా!'' అని చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చడం తన కర్తవ్యం కదా! అనుకున్నాడు. చిన్నవయస్సులో తన బాధ్యతను గుర్తెరిగిన సిన్నోడు ఆ క్షణమే వింటి నుండి దూసుకెళుతున్న బాణంలా బజారుకేసి పరుగులు తీశాడు. 
అంగడిలో శెనగపప్పు కొనుక్కుని వేగంగా పరుగెత్తుతూ మళ్లీ బామ్మ కొట్టు వద్దకు వచ్చాడు. శెనగపప్పును ముసలావిడకు ఇచ్చాడు. పెద్దాయనతో ఉన్నప్పుడంతా పరుగుతీయటమే కాని, నడిచివెళ్ళిన సందర్భాలు లేనేలేవు. ఆ పెద్దాయన సిన్నోడిని చురుకులా ఉండేలా తీర్చిదిద్దారు. ఆ ముసలావిడ శెనగపప్పును శుభ్రం చేసి, నీటిలో బాగా కడిగి, పక్కనే ఉన్న బండపై ఆరబెట్టింది. సిన్నోడిని కాకులు తినకుండా కాపలా కాయమంది. సిన్నోడు బామ్మ చెప్పినట్లే కాపలా కాసాడు. శెనగపప్పులు బాగా ఆరిన తర్వాత బామ్మ వాటిని ఓ సంచిలో పోసిచ్చి ''సిన్నోడా త్వరగా వెళ్లి వీటిని పిండికొట్టుకురా'' అంది. 
సిన్నోడు అదిరిపోయాడు. జరుగుతున్నదంతా చూస్తుంటే ఈ ముసలావిడ బజ్జీలు కాల్చి ఇచ్చేలోపలే తను బజ్జీ అయిపోతానేమో అనుకుంటూ సంచిని తీసుకుని పిండిమర మిల్లు కోసం పరుగు ప్రారంభించాడు. అలా పరుగెత్తుతున్నప్పుడే ముసలావిడ ''సిన్నోడా పెద్దాయనకు పొడవైన బజ్జీలంటేనే ఇష్టం. బజారులో పెద్ద అరటికాయలుంటే కొనుక్కురా. అలాగే మంచి నూనెను కొనుక్కుని రా' అంటూ చెప్పినవన్నీ విన్నాడు. పరుగెడుతూనే 'ఓ బజ్జీ కోసం ఈ ముసలావిడ కిరాణా సరుకులన్నీ అడుగుతొందే' అని అనుకున్నాడు. మళ్లీ 'పెద్దాయనకు కాల్చి ఇచ్చే బజ్జీ కూడా శుభ్రంగా ఉండాలని ఆ బామ్మ తపిస్తోంది కదా!' అని అనుకోగానే సిన్నోడికి ఆశ్చర్యమేసింది. 
ఆ ముసలావిడ ప్రవర్తన చూస్తుంటే పెద్దాయనపై తనొక్కడే అపారభక్తిని కలిగి ఉన్నానే భావన తప్పేమో అన్న అనుమానమూ ఏర్పడింది. పెద్దాయనపై బామ్మ చూపుతున్న భయభక్తుల ముందు తన భక్తి దిగదుడుపేమో అని అనుకున్నాడు సిన్నోడు. నడినెత్తిన ఎండ కాస్తుండటంతో చెమటలు తుడుచుకుంటూ ఓ పిండిమిల్లులో శెనగపప్పును పిండి కొట్టించుకున్నాడు. అక్కడి నుండి తిరిగి వస్తూ మార్కెట్లో పొడవైన మూడు అరటి కాయలు, మంచి నూనె కొనుక్కుని బామ్మ బజ్జీల అంగడి వద్దకు తిరిగొచ్చాడు. పొద్దున్నుంచీ బజ్జీలు కాల్చటంతో మాడిన నూనెను పారబోసి, కొత్త నూనెతో ఆ బామ్మ పెద్దాయన కోసం కాల్చనున్న బజ్జీలు చాలా రుచిగా ఉండబోతున్నాయనుకున్నాడు. 
బజ్జీల తయారీకి అన్ని వస్తువుల్ని సమపాళ్ళలో ఉంచుకుని, ఆ బామ్మ అరటి కాయను ఒలిచి, పూత రేకులా సన్నగా తరిగి, శెనగపిండిలో తడిపి, వరుసగా కాగుతున్న నూనెలో జారవిడుస్తోంది. బజ్జీలు నూనులో ఉడుకుతున్నప్పుడు అంతకు ముందే పెద్దాయన చెప్పినట్లు సిన్నోడు పక్కనే కూర్చుని గాయత్రీమంత్రం పఠించాడు. కొద్దిసేపయ్యాక బంగారపు రంగులో మెరుస్తున్న పొడవైన ఆరు బజ్జీలను ఓ అరటి ఆకులో మడిచి పొట్లం కట్టి సిన్నోడి చేతికిచ్చింది బామ్మ. సిన్నోడు పట్టరాని సంతోషంతో బజ్జీలను తీసుకుని పెద్దాయనకు ఇవ్వడానికి అంకాళమ్మ గుడివైపు పరుగెత్తాడు. 
పెద్దాయన వద్దకు వెళ్లగానే బజ్జీల కోసం బజారుకెళ్లి సరకులు కొనడానికి తాను పడిన తిప్పలు గురించి ఏకరవు పెట్టి ఆయన మెప్పుపొందాలనుకున్నాడు సిన్నోడు. అప్పటికే పెద్దాయన సిన్నోడి మనసులోని భావాలను తెలుసుకున్నారేమో. సిన్నోడు నోరుమెదపక ముందే పెద్దాయన పొట్లం అందుకుని ''ఆహా! ఇదేరా మైసూరు బజ్జీ అంటే. మైసూరు మహారాజు వద్ద పనిచేసే వంటవాడు తయారు చేసేది మైసూరు బజ్జీ కాదు. ఈ ముసలావిడ కాల్చిచ్చిన బజ్జీయే అసలుసిసలు మైసూరు బజ్జీ! 
ఆ ముసలావిడ నువ్వనుకున్నట్లు సాదాసీదా ముసలావిడ కాదురా! మైసూరు చాముండీదేవిని నడచివెళ్లి, కొండెక్కి అరవైయేళ్లు దర్శనం చేసుకున్న మహాసాధ్విరా! అంతేకాదురా! సహస్రచంద్రదర్శనం పూర్తి చేసుకున్న పుణ్యమూర్తిరా!'' అని చెబుతూ నేరుగా గుడిలోపలికి వెళ్లి అంకాళమ్మ విగ్రహం వద్ద మాట్లాడసాగారు. 
సిన్నోడికి మాటపెగల్లేదు. ఆ ముసలావిడ సహస్రచంద్రదర్శనం పూర్తి చేసుకున్నదని పెద్దాయన చెబుతున్నారే. ఈ విధంగా సహస్రచంద్ర దర్శనం చేసిన ఇలాంటి బామ్మ వద్దే కదా పిట్టిని అడిగి ఆరగించి మహాశివుడు వైగైనదిలో మట్టిని మోసింది! మరి మన పెద్దాయన మహాశివుడా? ఆయన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో అని అనుకుంటూ గుడిలో పెద్దాయన వైపు చూశాడు. 
గుడిలోపల ఆ పెద్దాయన అంకాళమ్మతో ఏవో మాట్లాడుతూ ముసలావిడ ఇచ్చిన బజ్జీని నైవేద్యంగా పెడుతున్నారు. అంకాళమ్మ వద్ద పెద్దాయన మాట్లాడే తీరు వర్ణనాతీతం! ఆ మాటలన్నీ దేవ భాషలోనివేమో! అవి ఎవరికీ బోధపడవు. కొన్ని సమయాల్లో పసిబిడ్డను చంకనెత్తుకుని చంద్రుణ్ని చూపి పాలబువ్వను తినిపిస్తున్న తల్లిలా పెద్దాయన నోటి నుండి అందమైన తేలిక పదాలు వినిపిస్తాయి. 
కొన్ని సందర్భాలలో అంకాళపరమేశ్వరి మాట్లాడుతున్నట్లు తేనెలాంటి మాటలూ వినిపిస్తాయి. భాషాతీతమైన ఆ మాటలు తీయటి రాగంలా వినిపిస్తాయి. ఆ స్వరం దైవస్వరంలా ఉంటుంది. పెద్దాయన అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్న అద్భుత దృశ్యం చూసి మన సిన్నోడు అన్నీ మరచిపోయి స్థానువులా నిలిచిపోయాడు. 
చాలా సేపయ్యాక పెద్దాయన వెలుపలికి వచ్చి, మామూలుగా తాను కూర్చునే స్తంభాన్ని ఆనుకుని కూర్చునాడు. అప్పుడే సిన్నోడు ఈ లోకానికి వచ్చాడు. పొద్దున వెంటాడిన ఆకలి మళ్లీ కడుపులో మంట రగిల్చింది. 'ఇదిగో పెద్దాయన చేతిలో ఉన్న బజ్జీలలో ఒకదాన్ని ఇస్తారు అంతదాకా ఓపికపట్టు' అంటూ ఆరాటపడుతున్న మనస్సును అదుపు చేశాడు. ఇలాంటి సమయాల్లో చేతికందినది నోటికి అందకుండా పోయిన సందర్భాలనూ సిన్నోడు చవిచూశాడు. అతిథులెవరో వచ్చి తన వాటా తిండిని తీసుకుని అదృశ్యమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు వేచి చూసి విసిగి వేసారిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడూ తన వాటా బజ్జీని ఎవరైనా వచ్చి దానంగా తీసుకెళతారేమోనని కంగారుపడ్డాడు. ఓరకంట ఆ ప్రాంతం చుట్టూ చూశాడు. హమ్మయ్య! కనుచూపుమేరకు ఎవరూ కనపడలేదు. సిన్నోడి మనసు కుదుటపడింది. సిన్నోడి మనసుపడుతున్న ఆరాటాన్ని పట్టించుకోకుండా పెద్దాయన చాలా ప్రశాంతంగా ఒక్కో బజ్జీని మెల్లగా రుచి చూస్తూ నమిలి తినసాగారు. 
మొదటి బజ్జీని చేతిలో తీసుకోగానే కొన్ని మంత్రాలు, గాయత్రీ మంత్రం పఠించారు. 'పృథ్వీ దేవతా నమోనమః' అంటూ బజ్జీని నోటిలో వేసుకుని నమిలి తిన్నారు. రెండో బజ్జీని తీసుకుని అలాంటివే మంతాల్రు. 'జల దేవతా నమోనమః' అంటూ నోటిలో వేసుకున్నారు. ఇదే విధంగా తక్కిన మూడు బజ్జీలను 'అగ్ని దేవతా, వాయు దేవతా, ఆకాశ దేవతా నమో నమః' అంటూ దేవతలకు ఆహుతిగా సమర్పించాడు. 
సిన్నోడికి ఏమీ అర్థం కాలేదు. కోపం కట్టలు తెచ్చుకున్నట్లు తన్నుకొస్తోంది. 'అబ్బా! పొద్దున్నుండీ ఏమీ తినకుండా మండుటెండలో తిరిగి, బజారుకెళ్లి శెనగపప్పు, అరటికాయలు, నూనె కొని, ముసలావిడకిచ్చి, ఆవిడ కాల్చిన బజ్జీలు తీసుకొచ్చి ఇస్తే, ఈ పెద్దాయన తనను పట్టించుకోవడమే లేదే' అని లోలోపల మండిపడ్డాడు. వెంటనే పెద్దాయన్ని అడగాలనుకున్నాడు. 
మళ్లీ కొంచెం ఓపికపడదామనుకున్నాడు. పెద్దాయన రుచిచూసి నాలుక చప్పరిస్తూ బజ్జీలను ఆరగిస్తుండటాన్ని చూశాడు. ఐదు బజ్జీలను ఆరగించిన తర్వాతే పెద్దాయన సిన్నోడిని చూశారు. 
''ఇదిగో సిన్నోడా! ఈ దేహం పంచభూతాలతో తయారైందిరా! పృథ్వి, జలం, అగ్ని, వాయు, ఆకాశం అనే పంచభూతాలను రోజూ ప్రతి మనిషి పూజించాలి. వాటికంటూ సరైన ఆహూతిని అప్పుడప్పుడూ సమర్పించాలి. అప్పుడే పంచభూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచం సక్రమంగా నడుస్తుంది. దీన్ని అందరికీ విడమరచి చెప్పలేం. ఈ రోజు రంగపంచమి కదా! పంచభూతాలు రంగనాధుడిని దర్శించి తమపైని దోషాలను తొలగించుకుంటాయి. కనుకనే ఈ రోజు ఆ పంచభూతాలకు పూజలు, ఆరాధన, ఆహూతి సమర్పణ చేయడం చాలా గొప్ప విషయం. వెంకటరామన్‌ అని ఆ పెరుమాళ్‌ పేరు పెట్టుకున్న కారణంగానే నీచేతుల మీదుగా బజ్జీలను ఆ దేవతలకు ఆహూతినివ్వాలని మిద్దెపై నుండే స్వామి ఆజ్ఞాపించాడు'' అంటూ పెద్దాయన కన్నుగీటారు. 
సిన్నోడికి పట్టరాని సంతోషం. అంతలోనే పశ్చాత్తాపం. మనపై అపార కరుణ చూపుతున్న పెద్దాయన గురించి తప్పుగా అనుకున్నానే అని. పెద్దాయన మళ్లీ ఏం చెబుతాడా అని ఎదురుచూసాడు. 
పెద్దాయన మళ్లీ మాట్లాడుతూ ''రోజూ భోజనం చేసేటప్పుడు కాకికి ప్రసాదాలు పెట్టేంతగా ఆకులో కొంత ప్రసాదాన్ని ఓరగా పెట్టుకోవాలి. అన్నం తిన్న తర్వాత ఆకుతోపాటు ఆ ప్రసాదాన్ని బయటపారేయాలి. అదే పంచభూతాలకు సరైన ఆహుతి అవటమే కాక ఈ పంచభూతాలతో తయారైన దేహానికి సద్గతి లభించటానికి అన్నపూర్ణాదేవి కరుణాకటాక్షాలు తోడ్పడుతాయి. ఇప్పుడా అలవాట్లన్నీ బాగా తగ్గిపోయాయి. అందరూ ఎంగిలిపడిన మిగిలిన అన్నపు మెతుకుల్ని, కాయగూరల్ని ఆకుతోపాటు పడేస్తున్నారు. అందుకేరా! మేము అప్పుడప్పుడూ పంచభూతాలకు పూజలు చేస్తున్నాం. 
కొన్ని సమాయాల్లో అన్నదానం చేసేటప్పుడో, అన్నం పాత్రలలో మిగిలినప్పుడో వేరే పాత్రలలో మార్చేటప్పుడో నేలపై పడే అన్నం వృథా అవుతుందని అనుకుంటాం. అయితే అ అన్నం ఎన్నటికీ వృథాకాదు. మేమే దానిని పంచభూతాలకు ఆహుతిగా ఆ ఐదు దేవతలలో ఒకటైన పృథ్వి (భూమి) లో కలిపివేస్తుంటాము. కనుక భగవంతుడి దృష్టిలో ఏదీ వృథాకాదు. నువ్వు కూడా పెద్దయ్యాక లక్షలాదిమందికి అన్నదానం చేసేటప్పుడు భోజనం, వంట పదార్థాలు నేలపై పడి వృథా అయినట్లు అగుపడతాయి. అవన్నీ పంచభూతాలు స్వీకరించనున్న ఆహూతి సమర్పణగా నువ్వు అర్థం చేసుకుంటే చాలు'' అని ముగించారు. 
సిన్నోడు పెద్దాయనను వింతగా చూడసాగాడు. 'మనసులో నువ్వనుకుంటున్నదని నిజమే రా' అని ఆ సిన్నోడి తలంపును పసిగట్టిన పెద్దాయన మళ్లీ మాట్లాడుతూ ''ఏమిటో! ఈ ముసలాయన మనల్ని తికమకపెడుతున్నాడని అనుకుంటున్నావా సిన్నోడా?'' అడిగాడు. 
అవునంటూ తలూపాడు సిన్నోడు. 
సిన్నోడు తికమకగా ఉండటానికి కారణం ఉంది. అంతకు ముందు ఈ పెద్దాయన ఓ సారి హోమం విశేషాలను గురించి చెబుతూ ఈ లోకంలో భగవంతుడు సృష్టించిన వస్తువులన్నీ నిరుపయోగం కాకుండా వాటిని స్వంతదారులకు అందించటమే సిద్ధపురుషులు చేసే హోమం అని చెప్పారు. ఇప్పుడేమో నేలపై పడినవేవీ నిరుపయోగం కాదని చెబుతున్నారు. అలాంటప్పుడు హోమ సంకల్పం ఎందుకో? 
ఎప్పటిలాగే పెద్దాయన ప్రశ్నతో తన సంభాషణను ఆపేశారు. దీనికి మీ సమాధానమేమిటో కాస్త ఆలోచించి చూడండి! 
పెద్దాయన ఐదు బజ్జీలు తిన్న తర్వాత ఆరో బజ్జీని చేతిలో ఉంచుకుని సిన్నోడి వంక చూశారు. సిన్నోడు ఆబగా నోరుతెరిచి ఆ బజ్జీ కేసి చూడసాగాడు. కొద్ది సేపు మౌనంగా ఉన్న పెద్దాయన ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా ఆ బజ్జీనీ ఆకులో మడిచిపెట్టుకున్నారు. 
''సిన్నోడా! రా వెళదాం!'' అంటూ చట్టుకున్న లేచి గుడినుండి బయటపడి నడక ప్రారంభించారు. సిన్నోడు పొద్దున్నుంచీ ఏమీ తినకపోవడం వల్ల, ఎండల్లో బాగా తిరిగి అలసిపోయినా పెద్దాయన వెనకే పరుగుతీశాడు. అంతటి అలసటలోను సిన్నోడికి ఓ విషయం గుర్తుకొచ్చి మనసు కుదుటపడింది. తాను పొద్దున్నుంచీ ఏమీ తినకపోయినా పెద్దాయన ఆ ఐదు బజ్జీలను తన కళ్లెదుటే తింటున్నా వాటిని తినాలనే తలంపే కలుగలేదు. ఇదేమి ఆశ్చర్యం. ఇదేనా పెద్దాయన చెబుతుండే దైవభక్తులకు కలిగే ఆధ్యాత్మిక ఆనందమేనా? 
సిన్నోడి తలంపులకు అడ్డు తగిలేలా పెద్దాయన అరుపు వినపడ్డది. ''ఏరా సిన్నోడా! ఈ ముసలోడు చేత బజ్జీపట్టుకుని ఎంత దూరం పోయేది. దీన్ని ఎవరికైనా దానం చేద్దామనే ఆలోచన లేకుండా ఉన్నావే'' అంటు కసరుకున్నారు. 

ఏ వస్తువును మీరు చూసినా మీ పుణ్యశక్తి ఆ వస్తువుపై ప్రసరిస్తూనే ఉంటుంది. అయితే దేవుడి విగ్రహాలు, దేవుని చిత్రపటాలు, గోపురాలు, ఆలయ తీర్థకొలనులు, మూలికా వృక్షాలు, స్థలవృక్షాలును చూస్తుంటే ఆ పవిత్ర వస్తువుల నుండి పుణ్యశక్తులు మీ నేత్రాల ద్వారా మీలోకి ప్రసరిస్తాయి. 

సిన్నోడికి అప్పుడే తెలిసింది. పెద్దాయన వెనకనే నడచుకుంటూ అంకాళమ్మ గుడి దాటుకుని చాలా దూరం వరకూ వచ్చేశామని. సిన్నోడికి మళ్ళీ అయోమయం! తను పొద్దున్నుంచీ ఆకలితో వుంటే పట్టించుకోకుండా ఆ బజ్జీని ఎవరికి దానం చేయబోతున్నారో తెలియటం లేదే? సిన్నోడి మనసంతా గజిబిజిగా మారింది. తన మనస్సును అదుపు చేసుకుని చుట్టుపక్కల చూశాడు. 
కనుచూపు మేర ఎవరూ కనిపించలేదు. ఇక పెద్దాయన చేయబోతున్నదేమిటో సిన్నోడికి అర్థమైంది. ఆ పెద్దాయన 'తెల్లచొక్కా, చిన్న గడ్డం, తలలో రుద్రాక్షమాల ధరించిన ఏదో ఓ వ్యక్తి ఆనవాళ్ళు తెలిపి ఆ బజ్జీని ఆయనకు ఇచ్చిరా అని చెప్పబోతున్నారు. పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏమో ఈ తిరుగుళ్లతో చచ్చిపోతున్నాన్రా దేవుడా!' అని మనసులోనే అనుకున్నాడు. 
''నువ్వు ఏ ఆనవాళ్ళు ఊహించుకుని ఎవర్నీ వెదకాల్సిన పనిలేదు సిన్నోడా. పొద్దున్నుంచీ ఈ ముసలోడుకి బజ్జీలను తినిపించేందుకు చాలా కష్టపడ్డావు. ఈ బజ్జీని తీసుకెళ్లి ఆ అంకాళమ్మ గుడి ద్వారం వద్ద ముసలోడు కూర్చుని ఉంటాడు ఆయనకిచ్చి, ఆయన పేరడిగి తెలుసుకుని వచ్చేయ్‌'' అన్నారు పెద్దాయన. సిన్నోడు కాస్త కుదుటపడ్డాడు. కానీ మళ్లీ అంతదూరం పరుగెత్తుకెళ్ళి తిరిగి రావాలి కదా! అయ్యబాబోయ్‌!' అంటూ దిగులుపడ్డాడు. అప్పటికే చాలా పోద్దుపోయింది. బజ్జీని ఇచ్చేసి పెద్దాయన వద్దకు తిరిగొస్తే రాత్రి భోజనమైనా అడిగి తిందాంలే అనుకున్నాడు. 
ఓ వైపు కడుపులో మండుతున్న ఆకలి, మరో వైపు ఆధ్యాత్మిక అనుభవాలు సిన్నోడిని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకనేమో రామలింగస్వామి 'ఎప్పుడూ ఆకలితో వుండు' అని చెప్పారా? అంటూ ఆత్మవిచారంలో పడ్డాడు సిన్నోడు. 'పెద్దాయన గుడి నుండి బయలుదేరినప్పడే ఆ ముసలాయన గుడి వద్దే ఉన్నాడు కదా. అప్పుడే ఈ బజ్జీని ఆయనకిచ్చి ఉండొచ్చు కదా? ఇంత దూరం తిరగనిచ్చి పెద్దాయన నాతో తమాషా చేయిస్తున్నారేమో!' ఈ తలంపు రాగానే సిన్నోడికి పెద్దాయనపై మళ్లీ కోపం పుట్టుకొచ్చింది. 
ఆ కోపంతోనే సిన్నోడు ఆ బజ్జీని తీసుకుని అంకాళమ్మ గుడివైపు పరుగెత్తాడు. సగం దూరం పోయాక సిన్నోడికి భయమేసింది. 
'పెద్దాయన అంత సులువుగా దానం చేయరు కదా! చినిగిన కౌపీనం కట్టుకున్న ఓ ముసలోడిని చూడు! నల్ల మూతి, తెల్ల తోకా ఉన్న కుక్కను వెదుకు అంటూ మనల్ని విసిగించేవారు కదా. ఇప్పుడేమో రోజూ కంటబడే భిక్షమెత్తుకునే ముసలోడికి ఈ బజ్జీని ఇమ్మంటున్నారే. ఒక వేళ తను అక్కడికి వెళ్లే సమయానికి ఆ ముసలోడు లేకుంటే... అమ్మో! తన గతి అధోగతే కదా!' అనే భయం కలుగటంతో సిన్నోడు పరుగు వేగాన్ని పెంచి అక్కడికి చేరుకున్నాడు. 
అన్ని దేవుళ్ళను మొక్కుకుంటూ ఎలాగో అంకాళమ్మ గుడివద్దకు వెళ్ళాడు. 'హమ్మయ్య! ఆ ముసలోడు గుడి వద్దే ఉన్నాడు' చాలా సంతోషంతో బజ్జీని ఆ ముసలోడి చేతికిచ్చి, 'పెద్దాయనా! నీ పేరేమిటి?'' అని అడిగాడు. 
ఆ ముసలోడు బజ్జీ చేతిలోకి తీసుకోగానే సిన్నోడిని అసలు పట్టించుకోనేలేదు. చంద్రమండలం నుండి జారిపడ్డ వస్తువేదో చేతికందినట్లు బజ్జీని చేతపట్టుకుని వింతగా చూస్తూ ఆబగా దానిని తినటం ప్రారంభించాడు. వేగంగా తినటం వల్ల బజ్జీ గొంతులో ఇరుక్కుని, కష్టపడి మింగటానికి తంటాలు పడ్డాడు. 
ఆకలి కలిగించే బాధ, ఆవేదన ఎలా ఉంటుందో ఆ రోజే ప్రత్యక్షంగా సిన్నోడు చూస్తున్నాడు. 'ఓ బజ్జీ కోసం ఈ ముసలోడు ఎన్నిరోజులు ఆరాటపడ్డాడో! ఈ రోజు మనమిచ్చేందే కదా నిజమైన దానం. ఇలా అవసరాన్ని కనిపెట్టి మరీ దానం చేయడం మన పెద్దాయనకు తప్ప ఇంకెవరికి తెలుసు?' ఇలా అనుకోగానే సిన్నోడికి అప్పటిదాకా పెద్దాయన మీదనున్న కోపం మాయమై ఆయనపై ఆరాధనభావం అధికమైంది. అదే సమయంలో సిన్నోడు తన ఆకలిని కూడా పూర్తిగా మరచిపోయాడు. 
ఆ ముసలోడు బజ్జీని పూర్తిగా తినేంత వరకూ ఆగిన సిన్నోడు ''తాతా నీ పేరేమిటి?'' అని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నను అప్పుడే అడిగినట్లు ముసలోడు 'నా పేరు సుబ్రమణి'' నెమ్మదిగా చెప్పాడు. ఇప్పటికిది చాలునంటూ ఆ ముసలోడి వద్ద సెలవు తీసుకుని పెద్దాయన ఉన్నచోటుకు పరుగెత్తాడు. అలా పరుగెత్తుతూనే 'ఈ సారి పెద్దాయన్ని అడగాలి, ఇలా రోజంతా నన్నెందుకింత తిప్పలు పెట్టావని?' అని అనుకున్నాడు సిన్నోడు. 
'ఆ గుడి నుండి బయటపడ్డప్పుడే ఈ బజ్జీనీ దానం చేసి ఉండొచ్చు కదా. పెద్దాయన ఆ బజ్జీని ఇంత దూరం తీసుకువచ్చే ఇబ్బంది తప్పేది కదా! గంట ముందే ఆ ముసలోడి ఆకలి బాధ తీరేది కదా! ఈ అల్ప విషయం కూడా మన గురువుగారికి తెలియకపోయిందే' అని మనసులో మథనపడుతూ తిరిగొచ్చాడు సిన్నోడు. 
''ఏం నాయనా! ఆ బజ్జీని ఇచ్చి రావటానికి ఇంత సేపా? నేనిక్కడ నీ కోసం పరోటాలు ఆర్డర్‌ చేసి ఎంతసేపు ఇక్కడ కాచుకుని ఉండేది?'' అంటూ చిన్నగా నవ్వుతూ సిన్నోడిపై చిరుకోపాన్ని ప్రదర్శించాడు పెద్దాయన. 
అప్పుడే సిన్నోడికి తెలిసింది ఆ పెద్దాయన ఓ టీ దుకాణం ముందు వద్ద నిలబడి ఉన్నట్లు. దిగ్బ్రాంతి చెందాడు. ఇదెలా సాధ్యం? తన వద్ద బజ్జీని ఇచ్చి అంకాళమ్మ గుడికి పంపేటప్పుడు పెద్దాయన నిలిచి ఉన్న ప్రదేశంలో కనుచూపు మేర ఏవీ కనిపించలేదు కదా. ఎడారిలా అగుపడింది. జనసంచారమే లేని ఆ చోట ఈ టీకొట్టు ఉన్నట్టుండి పుట్టుకువచ్చిందో తెలియడం లేదే.' సిన్నోడు మళ్లీ అయోమయంలో పడ్డాడు. అప్పటికే ఆకలి దంచేస్తుండటంతో 'ముందు ఈ పరోటాలను ఓ పట్టుపట్టాక ఆ విషయాన్ని ఆలోచిద్దాంలే' అని అనుకున్నాడు. 
''బాబూ సిన్నోడికి మూడు పరోటాలు ఇవ్వు'' అంటూ టీకొట్టు యజమానిని అడిగారు పెద్దాయన. సిన్నోడి ముఖం మళ్ళీ చిన్నబోయింది. 'పెద్ద ఏనుగు ఆకలిని ఈ చిన్న బొరుగులు తీరుస్తాయా? ఆకలితో నకనకలాడుతున్న మనకు ఈ మూడు పరోటాలు ఏ మూలకు?' నిస్పృహతో నిట్టూర్పు విడిచారు. అంతలోనే ''ఆహా! ఇప్పుడీ పరోటాలు లభించటమే అదృష్టం. మనమేదైనా నోరు తెరిస్తే ఈ పెద్దాయన ''సరే సిన్నోడా! మరో చోటుకు వెళదాం రా! అక్కడ దండిగా పరోటాలు తీసిస్తాను' అంటూ మరో పది పదిహేను మైళ్ల దాకా నడిపిస్తే అయ్యబాబోయ్‌! నా గతేంకాను?'' అంటూ మనసులోనే అనుకుంటూ సిన్నోడు చేతుల్ని శుభ్రంగా కడుక్కుని కూర్చున్నాడు. పెద్దాయన చెప్పినట్లే టీకొట్టు కుర్రాడు ప్లేటులో వేడిగా ఉన్న మూడు పరోటాల్ని తనముందుంచాడు. పెద్దాయన అంతకు ముందు తీసిచ్చిన పరోటాలన్నీ గట్టిగా, మాడిపోయి ఉండేవి. ఓ పరోటాను నమిలి మింగితే పళ్ళన్నీ రాలిపోతాయేమోనన్నంత గట్టిగా ఉండేవి. 
మరి ఈ రోజో సానా ఆశ్చర్యం! ఈ పరోటాలు తెల్లగా దూది పింజల్లాగా మెత్తగా ఉన్నాయి. వేడిగాను ఉన్నాయి. నంజుకునేందుకు చిక్కటి కుర్మా కూడా ఉంది. సిన్నోడు చాలా సంతోషపడ్డాడు. ఎందుకనో ఒక పరోటాను తినగానే కడుపు నిండిపోయినట్లనిపించింది. రెండో పరోటాను కష్టపడి గబగబా మింగేశాడు. మూడో పరోటాను తినలేక ఆకులోనే మడిచి చెత్తకుప్పలో పడేశాడు. 
సిన్నోడు తిన్న పరోటాలు వెన్నలా చాలా మృదువుగా ఉన్నాయి. అంతటి మెత్తని పరోటాలను ఏనాడు తినలేదు. 'తనకు ఏది కావాలో దాన్ని అనువైన చోట, సరైన సమయంలో ఇవ్వటమే పెద్దాయనకున్న అరుదైన గుణం' అంటూ మనసులోనే పెద్దాయన్ని పదే పదే పొగిడాడు. ఆ పరోటాలు ఆరగించిన తర్వాత పెద్దాయన ఎప్పటిలాగే ముందు వేగంగా నడచి వెళుతుండగా సిన్నోడు ఆయనను పరుగులాంటి నడకతోనే వెంబడించాడు. 
ఇద్దరూ వేగంగా నడుస్తున్నారు. ఉన్నట్టుండి పెద్దాయన నవ్వుతూ ''సిన్నోడా సుబ్రమణి బజ్జీని తిన్నాడా?'' అని అడిగారు. అప్పుడే సిన్నోడికి తన పాత సంకల్పం గుర్తుకు వచ్చింది. 'ఆహా పెద్దాయన కొనిచ్చిన పరోటాలతో మాయలో పడ్డానే' అనుకున్నాడు. అతి కష్టం మీద కోపాన్ని రప్పించుకున్నాడు. 
''వాద్యారా, మీకు అన్నీ ముందే తెలుసు! మరి ఎందుకిలా నాటకమాడి నన్ను ఆకలితో అలమటింపజేశారు?'' తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో అడిగాడు సిన్నోడు. 
పెద్దాయన ''ఒరేయ్‌! కాస్త ఆపురా! మేం చేస్తున్న ప్రతి పని వెనుక ఏదో పరమార్థం ఉంటుందని నీకు ఎన్నోమార్లు చెప్పాను కదా! ఈ రోజు ఏం వారం?'' 
''ఆదివారం.'' 
''సరే. మనం గుడి నుండి బయలుదేరేటప్పుడు సమయమెంత?'' 
''సాయంత్రం ఐదున్నర. రాహుకాలం.'' 
''ఇప్పుడు చెప్పు సిన్నోడా! ఆ బిక్షగాడి పేరు సుబ్రమణి అని తెలుసుకున్నావు కదా. సుబ్రమణి అనే పేరున్న వ్యక్తి రాహుకాలంలో శెనగపిండితో చేసిన బజ్జీని తినొచ్చా?'' 
సిన్నోడు సిగ్గుతో తలదించుకున్నాడు. పెద్దాయన పలుమార్లు చెప్పారు సుబ్రమణి అనే పేరుకలిగిన వ్యక్తులు రాహుకాలంలో శెనగపిండితో చేసిన ఫలహారాలు తినకూడదని. 
'ఈ నిజాన్ని మనం తెలుసుకోలేకపోయామే. పెద్దాయన అనుకుంటే మళ్లీ ఓసారి వెళ్లి అతడి పేరు కనుక్కుని రమ్మని చెప్పి ఉండాలి. లేదా మనమైనా కాస్త బుర్రను ఉపయోగించి ఆలోచించి ఉండాల్సింది. పెద్దాయన ఆ భిక్షగాడి పేరెందుకు అడుగుతున్నాడు? బజ్జీలకు అతడి పేరుకు ఉన్న సంబంధం ఏమిటని ఓ నిమిషం ఆలోచించి ఉండాల్సింది. సరైన మట్టి బుర్రనాది! ఓ బజ్జీని దానం చేయడానికి కూడా ఆధ్యాతికపరంగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించే ఈ పెద్దాయనకు మించిన ఆధ్యాత్మిక గురువు ఈ ప్రపంచమంతా వెదికినా దొరకరు కదా! ఆహా ఏమి నా భాగ్యం!' అనుకోగానే సిన్నోడి మొహంలో వెలుగొచ్చింది. 
మరుక్షణమే సిన్నోడు ఎప్పటిలాగే పసిపిల్లవాడి మనస్తత్వంతో పెద్దాయనను ఇలా ప్రశ్నించాడు. 
''వాద్యారా! మీరేమో ఇంత పెద్ద మేధావిగా ఉన్నారు. మరి మీ వెంటే ఎప్పుుడూ తిరుగుతున్న నేనెందుకిలా తిండిపోతురాముడిగా, బుర్రలేనివాడిగానే ఉంటున్నాను?'' అని అడిగాడు సిన్నోడు. 
అమాయకంగానూ, అదే సమయంలో న్యాయసమ్మతంగా సిన్నోడు అడిగిన ఆ ప్రశ్నకు మురిసిపోయిన ఆ పెద్దాయన బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నారు. 
''ఒరేయ్‌! నేనే ఒక జ్ఞాన శూన్యం! నా వెంట తిరిగే నువ్వూ మట్టి బుర్రగా కాక మరెలా వుంటావు?'' అంటూ కన్నుగీటి మరోమారు మనసారా నవ్వారు. మన సిన్నోడు కూడా పెద్దాయనతో కలిసి నవ్వసాగాడు. ఈ గురుశిష్యుల ఆనందసాగరంలో మునిగి మీరూ ఆనందిస్తారు కదూ! 

 

ఓం సద్గురు శరణమ్

అనుభవాలు సాగిస్తున్నాయి ...

om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi om sakthi
om sri guruve saranam om sri guruve saranam om sri guruve saranam